కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనబోనని అప్పుడే ప్రకటించిన ఆయన, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. 2026లో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ పూర్తి చేయాల్సిన సినిమాలను పూర్తి చేస్తూనే తన రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. తాజాగా గురువారం ఆయన తన పార్టీ జెండా, అజెండాను ఆవిష్కరించారు.
‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ జెండాను పరిశీలిస్తే ఎరుపు, పసుపు రంగులతో కలిసి ఉంది. మధ్యలో పురి విప్పిన నెమలి ఉండగా, దానికి అటు, ఇటుగా ఒక్కో ఏనుగు ఉంది. జెండా, పార్టీ గీతాన్ని విజయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు, మద్ధతుదారులు పాల్గొన్నారు. విజయ్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ‘దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లిపోయి, మన హక్కుల కోసం పోరాడిన సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ప్రజలకు అవగాహన కల్పించి, అందరికీ సమాన హక్కులు, అవకాశాలను కల్పిస్తాం. అందరం సమానం అని చెప్పే సమానత్వ సూత్రాన్ని బలంగా పాటిస్తాం. కుల, మతాలు, లింగ వివక్ష పేరుతో జరిగే వివక్షను తొలగిస్తాం’ అని పేర్కొన్నారు విజయ్.
తమిళనాడులో విజయ్ అగ్ర కథానాయకుడైనప్పటికీ రాజకీయాల్లో ఆయన ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో టాప్ పోజిషన్‌లో ఉన్న సమయంలో ఆయన రాజకీయాల వైపు అడుగులు వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రానున్న తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేదా పొత్తులతో ముందుకు వెళుతుందా? అనేది వేచి చూడాలి.