యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమా సినిమాకు తన క్రేజ్‌ను పెంచుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఆయన తాజా చిత్రం కూలీ. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చాలా రోజుల తర్వాత తలైవర్‌ను లోకేష్ పక్కా నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో సినిమాలో రజినీ గోల్డ్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారనే విషయం స్పష్టమైంది. అలాగే ఈ సినిమాలో ఆయన కుమార్తె పాత్రలో శ్రుతీ హాసన్ నటిస్తుంది. ఓ యూనివర్స్ పేరుతో సినిమాలను తెరకెక్కిస్తున్న లోకేష్ ఇప్పుడు కూలీని అందులో భాగంగా చూపిస్తారా.. లేదా! అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో కూలీ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించబోతున్నారు. రజినీకాంత్‌ను ఢీ కొట్టే పాత్రలో మెప్పిస్తారా! మరేదైనా రోల్లో అలరిస్తారా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. తను ఎంతో అభిమానించే రజినీకాంత్‌తో కలిసి నటిస్తుండటం ఉపేంద్ర ఆనందంతో పొంగిపోతున్నారు. లోకేష్‌కు ధన్యవాదాలను తెలియజేస్తూ సెట్స్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మరో వైపు దసరా సందర్బంగా అక్టోబర్ 10న రజినీకాంత్ తాజా చిత్రం వేట్టైయాన్ విడుదలవుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫేక్ ఎన్‌కౌంటర్స్‌కు వ్యతిరేకంగా పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా సూపర్‌స్టార్ కనిపించబోతున్నారు. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.