అనుకున్నదే అయ్యింది.. ఎట్టకేలకు సూర్యనే వెనకడుగు వేశారు. రానున్న దసరాలో కంగువతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయాలనుకున్న ఆయన ఆశలకు రజినీకాంత్ బ్రేకులేశారు. దీంతో కంగువ వాయిదా పడనుంది. ఇంతకీ రజినీ వర్సెస్ సూర్య పోరులో సూర్య వెనకడుగు వేయటానికి కారణమేంటి? కంగువ కొత్త రిలీజ్ డేట్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విశేషాలను ఇప్పుడు చూసేద్దాం…
కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య వెనకడుగు వేయక తప్పలేదు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం కంగువ. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందింది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రాబోతున్నట్లు రిలీజ్ డేట్‌ను కూడా ముందుగానే చెప్పేసుకున్నారు. అయితే అనుకోకుండా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు సూపర్‌స్టార్ రజినీకాంత్. వేట్టైయాన్ సినిమాను కూడా అక్టోబర్ 10నే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది సూర్యకు చాలా ఇబ్బందిగానే మారింది. ఎందుకంటే కంగువ మీద ఈ వెర్సటైల్ యాక్టర్ చాలా ఆశలనే పెట్టుకున్నారు. చాలా కష్టపడి చేసిన సినిమా.. భారీ బడ్జెట్.. పాన్ ఇండియా రేంజ్‌లో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరాలంటే ముందుగా ఎలాంటి గట్టిపోటీ లేకుండా చూసుకోవాలనుకున్నారు. అయితే చివరకు రజినీకాంత్ నుంచే పోటీ వచ్చేసింది.
రెండు క్రేజీ సినిమాలు ఓకే రోజున వస్తే ఆ ఎఫెక్ట్ బాక్సాపీస్ మీద పడుతుంది. దాని వల్ల కలెక్షన్స్ డ్రాప్ అవుతుందని భావించిన సూర్య తన కంగువ రిలీజ్ డేట్‌ను మార్చుకున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న విడుదల చేస్తారనే వార్తలు సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. కంగువ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఓ కారణం. వారందరూ రజినీకాంత్ సినిమాపై ఆసక్తి చూపించారు. కంగువను వాయిదా వేసుకోవాలని నిర్మాతను కోరటంతో తప్పని పరిస్థితి.
జైలర్‌తో రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సాధించి దాదాపు రూ.600 కోట్లు రాబట్టారు. తర్వాత వచ్చిన లాల్ సలామ్ డిజాస్టర్ అయినా, దాన్నెవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మళ్లీ వేట్టైయాన్‌పై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. అందుకు కారణం.. సినిమాలో రజినీతో పాటు అమితాబ్ నటించటం. అలాగే జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జ్ఞానవేల్ వేట్టైయాన్‌ను తెరకెక్కించారు. ఫేక్ ఎన్‌కౌంటర్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసే రిటైర్డ్ పోలీస్ పాత్రలో రజినీకాంత్ కనిపించనున్నారు. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ క్రేజీ మూవీ వైపుకే డిస్ట్రిబ్యూటర్స్ మొగ్గు చూపారు.
ఇద్దరు స్టార్స్‌ను దాదాపు ఒకే డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రిలీజ్ చేస్తుండటంతో వారందరూ కంగువ మేకర్స్‌తో పాటు హీరో సూర్యను రిక్వెస్ట్ చేశారు. దీంతో సూర్య తన సినిమానే వెనక్కి తీసుకెళ్లారు. ఎలాగూ దీపావళికి పెద్ద సినిమాలేవీ లేకపోవటం కూడా సూర్యకు కలిసొచ్చే అంశమే. లాంగ్ వీకెండ్ కూడా ప్లస్ కానుంది. మరి దీపావళికైనా సూర్యకు అడ్డంకులేవీ రాకూడదనే కోరుకుందాం…