Monday, December 23, 2024

Latest Posts

కవితకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. దాదాపు గంటన్నరపాటు వాదనలు జరగ్గా.. చివరకు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్‌ ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. బెయిల్‌ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని.. ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సిన ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై వాంగ్మూలం ఆధారంగా ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం టెండర్లకు సంబంధించి సౌత్ లాబీ తరుఫున కోట్ల రూపాయలు చేతులు మారాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్రపిళ్లైని విచారించి.. రిమాండ్ నివేదికలో కవితకు అతడిని బినామీగా పేర్కొంది.గతేడాది మార్చిలో నోటీసులు పంపి కవితను విచారించింది ఈడీ. ఆ తరువాత మళ్లీ ఆమెకు నోటీసులు పంపి మార్చి 15న కవితను అరెస్ట్ చేసింది. దాదాపు 164 రోజులు జైలులో ఉన్న ఆమెకు ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది ధర్మాసనం.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.