హీరో నాని వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్ట్ 29న పాన్ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండబోతుంది.. విలన్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాలను క్లియర్‌గా చెప్పేశారు. ‘అంటే సుందరానికీ!’ సినిమాను కామెడీ కోణంలో తెరకెక్కించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈసారి స్టైల్ మార్చారు. ‘సరిపోదా శనివారం’ను పక్కా యాక్షన్ మోడ్‌లో తెరకెక్కించారు.
చిన్నప్పటి నుంచి అన్యాయాన్ని చూస్తే తట్టుకోలేని హీరో క్యారెక్టర్. నా అనుకున్నవాళ్ల కోసం అతను ఎంత దూరం అయినా వెళ్తాడు. అతని కోపాన్ని కంట్రోల్ చేయటానికి కేవలం శనివారం మాత్రమే కోపం చూపించాలని తల్లి కండీషన్ పెడుతుంది. మరో వైపు విలన్ ఎస్.జె.సూర్య విషయానికి వస్తే అతనొక పోలీస్ ఆఫీసర్ సైకోలా ప్రవర్తిస్తుంటాడు. ఇలాంటి వేర్వేరు మనస్తత్వాలున్న ఇద్దరు వ్యక్తులు ఓ సందర్భంలో గొడవపడితే.. అదెంత దూరం తీసుకెళ్లిందనేదే కథ. అయితే దీన్ని దర్శకుడు వివిక్ ఆత్రేయ ఎలా హ్యాండిల్ చేశారనేది సినిమాలో చూడాల్సిందే. నాని పాత్రకు సాయికుమార్ డైలాగ్స్ రూపంలో ట్రైలర్‌తో చక్కటి ఎలివేషన్ ఇచ్చారు. అలాగే ఎస్‌జె సూర్యలోని సైకోయిజాన్ని కూడా సన్నివేశాల రూపంలో ఎలివేట్ చేశారు. మొత్తానికి ట్రైలర్ ఆసక్తికంగా ఉంది.
‘సరిపోదా శనివారం’లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. లవ్ ట్రాక్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందనేది సిల్వర్ స్క్రీన్‌పై వీక్షించాల్సిందే. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుభలేక సుధాకర్, మురళీ శర్మ, సాయికుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జాక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి మురళి.జి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ కోసం నాని స్పెషల్ సమయాన్ని కేటాయిస్తారనటంలో సందేహం లేదు. ఈ సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకునే పనిని మరో మెట్టుకు తీసుకెళతారు. దీని తర్వాత కూడా నాని తను చేస్తున్న సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లోనే చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మూవీ చేస్తుండగా, హిట్ 3 సినిమాను కూడా ఇదే ఏడాది సెట్స్ పైకి తీసుకెళుతున్నారు నేచురల్ స్టార్.