బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతున్నారు. మొదటగా ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో రావణుడిగా నటించాడు. తనదైన శైలిలో నటనతో మెప్పిస్తున్న సైఫ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా విలన్ పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్రాండ్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో సైఫ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఆడియన్స్ వారి అభిమాన హీరోలను దేవుళ్ళలా చూస్తారని తెలిపారు. అంతేకాకుండా స్టార్ హీరో సినిమాల్లో తాను నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
‘తెలుగు ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారు. తమ అభిమాన హీరోలను కూడా దేవుళ్లలా చూసుకుంటారు. అలాగే ప్రేక్షకులు ఏం కోరుకుంటారో దర్శకులు, నిర్మాతలు కూడా సినిమాలు అలానే తీస్తారు. కథనంపై స్పష్టమైన, బలమైన అవగాహన కలిగి ఉంటారు. బాహుబలి గొప్ప పౌరాణిక మరియు చరిత్రాత్మకమైన చిత్రం. వారు చిత్రించిన తీరు అద్భుతం. మేము ఒకే దేశంలో ఉన్నప్పటికీ, మాకు పూర్తిగా భిన్నమైన అభిరుచులు ఉన్నాయి. భాష వేరు. కానీ కెమెరా ఆన్ చేసినప్పుడు ప్రతిదీ మారుతుంది. భాష కూడా విశ్వవ్యాప్తం అవుతుంది. తాజాగా నటించిన ‘దేవర’లో డైలాగ్స్ విషయంలో కొరటాల శివ చాలా సాయం చేశారు. నేను ముంబై నటుడినే అయినా తెలుగులో చాలా కంఫర్ట్‌గా పనిచేశాను. దక్షిణాది నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. హీరోలను చూపించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది’ అని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.
తాజాగా ‘దేవర’ సినిమాలో భైర పాత్రలో ఆకట్టుకున్నారు సైఫ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, సైఫ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలు మరో స్థాయిలో ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా, సందీప్ వంగా ప్రభాస్ కాంబోలో ఓ భారీ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విల్లన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకోవాలనే యోచనలో వంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.