గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ వరుసగా సినిమాలు చేయడానికి పచ్చ జెండా ఊపేస్తున్నారు. ప్రస్తుతం చెర్రీ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడీ జాబితాలో కొత్తగా మరో ప్రాజెక్ట్ చేరినట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ కన్నడ స్టార్ దర్శకుడితో చరణ్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇప్పటికే దీనిపై చర్చలు పూర్తయినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ తారక్ సినిమాతో బిజీగా ఉన్నారు. . దీని తర్వాత ‘సలార్ 2’, ‘కేజీఎఫ్ 3’ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాల రామ్‌చరణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ప్రశాంత్ ఆ సినిమాలు పూర్తి చేసే లోపు చరణ్ బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలను పూర్తి చేయనున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దమౌతున్నారు రామ్‌చరణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరులో రానున్నట్లు ఇప్పటికే ప్రకటించినా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ సినిమా విడుదలకు రెండు తేదీలు వినిపిస్తున్నాయి. మూవీ మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే దాన్ని బట్టి డిసెంబరు 20న లేదంటే క్రిస్మస్ సందర్భంగా 25న విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం.
దీనిపై మంగళవారం ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్ర టీజర్ పనులు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని.. దసరాకి దాన్ని విడుదల చేయట్లేదని.. దీపావళి సందర్భంగా ఈనెల 30న ఓ పాట విడుదల చేస్తామని తమన్ వెల్లడించారు. అలాగే ఈ చిత్ర సీజీ, వీఎఫ్‌ఎక్స్ ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నారు.