కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. దర్శకుడు మణిరత్నం 33ఏళ్ల విరామం తర్వాత తిరిగి చేతులు కలపనున్నారా? ఈ విజయవంతమైన కాంబోలో ఓ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందా? అంటే అవుననే చెబుతున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీ – మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ 1991లో విడుదలై బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది. కానీ, ఆ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పని చేయలేదు. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ హిట్ కాంబో పునరావృతం కానుందని సమాచారం.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విషయమై రజనీకాంత్, మణిరత్నంకు మధ్య చర్చలు జరిగాయని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలిసింది. ప్రస్తుతం రజనీ హీరోగా టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్’ విడుదలకు సిద్ధమవగా.. ‘కూలీ’ చిత్రీకరణ దశలో ఉంది. ‘జైలర్ 2’ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. అలాగే మరో ఇద్దరు యువ దర్శకులు రజనీ కోసం కథలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక మణిరత్నం ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘థగ్ లైఫ్’ చేస్తున్నారు. ‘నాయకన్’ విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా ఇది. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ – లోకేశ్ కనగరాజ్ కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొన్నాళ్లుగా విశాఖపట్నంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌కు సంబంధించి రజనీ పాత్ర షూట్ ఇప్పటికే పూర్తవగా.. ఇప్పుడు మొత్తం షెడ్యూల్‌ను ముగించారు. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ ఈనెల 15నుంచి చెన్నైలో మొదలు కానుంది. ఇది మొదలైన కొద్ది రోజుల్లోనే రజనీ తిరిగి సెట్లోకి అడుగు పెట్టనున్నారు. ఇటీవల చిన్న శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.