నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా తండేల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో శివరాత్రి నేపథ్యంలో వచ్చే ఓ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ పాటని ఇటీవలే కొరియోగ్రాఫర్ శేఖర్ నేతృత్వంలో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవితో పాటు, వెయ్యి మందికిపైగా నటులతో పాటను చిత్రీకరించారు. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదిగా శివరాత్రి పాట నిలిచిపోతుందని మూవీ మేకర్స్ అంటున్నారు. తాజాగా ఆ పాట నుండి ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. నాగ చైతన్య, సాయి పల్లవి శివపార్వతులుగా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న తండేల్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
‘ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. నిజమైన సంఘటనలే అయినా, ఇద్దరు ప్రేమికుల జీవితాల్లోని భావోద్వేగాలు, సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా కల్పిత కథలకంటే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. దక్షిణ కాశీగా పేరు గాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ఇక్కడ నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల స్ఫూర్తితోనే ఈ సినిమాలో పాట తెరకెక్కించాం. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఎప్పటికీ నిలిచిపోయేలా ఓ క్లాసిక్ బాణీని సమకూర్చారు. భారీ సెట్స్‌ని తీర్చిదిద్ది, అత్యున్నత నిర్మాణ విలువలతో పాటని తెరకెక్కించామ’ని మేకర్స్ తెలిపారు.