తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష పూర్తి కానున్న నేపథ్యంలో పవన్ తిరుమల తిరుపతి వెళ్లనున్నారు. ఆయన నేడు తిరుమలకు చేరుకుంటారు. రెండ్రోజులపాటు అక్కడే బస చేస్తారు. అక్టోబర్ 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. లడ్డూ కౌంటర్, వెంగమాంబ కాంప్లెక్స్‌ను పరిశీలిస్తారు. అక్టోబర్ 3న దీక్ష విరమణ చేస్తారు. అనంతరం తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. మరోవైపు లడ్డూ కల్తీపై సిట్ విచారణ కొనసాగుతోంది.
గత కొద్దికాలంగా శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో శ్రీవారి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని ఇప్పటి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంపై అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది. కాగా, పవన్ ఈ విషయంపై సినీ ఇండస్ట్రీని హెచ్చరించిన సంగతి తెలిసిందే. లడ్డు వివాదం సోషల్ మీడియాలోనూ పోస్టుల యుద్దానికి దారి తీసింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఓ వారం రోజులు పాటు చేస్తే ఈ సినిమా మొదటి పార్ట్ కంప్లీట్ అవుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా మార్చి చివరి వారంలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాదే విడుదల కానున్నాయి.