జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా మారారు. తనదైన శైలీలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పనులు నిర్వర్తిస్తున్నారు. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్.. ఎన్నికల్లో భాగంగా ఇక నుంచి పిఠాపురంలోనే ఉంటా అని చెప్పారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురంలో సెటిల్ అవ్వడానికి స్థలం కొనుగోలు చేశారు.
సొంతంగా ఇల్లు కట్టుకొని పిఠాపురంలో లోకల్ అవ్వడానికి భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.8 ఎకరాలు మరో బిట్ స్థలాన్ని కొనుగోలు చేశారు. బుధవారం ఈ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన స్థలం విలువ రూ. కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. జనసేన నేతలు మరో పదెకరాలు కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో రెండు ఎకరాలలో క్యాంపు ఆఫీసు, మిగతా స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలనీ పవన్ ఆలోచిస్తున్నారు. ఎన్నికల తరువాత డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురంలో బుధవారం అయన పర్యటించారు. పర్యటనలో మాట్లాడుతూ స్థలం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గతంలో వైస్సార్సీపీ నేతలు తాను ఇక్కడ ఉండను.. హైదరాబాద్ లో ఉంటాను అని విమర్శించారని తెలిపారు. పిఠాపురంలో మూడున్నర ఎకరాలు కొనుగోలు చేశారని.. ఇల్లు, క్యాంపు ఆఫీస్ కట్టుకుంటానని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలందరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానేనని చెప్పారు. కొందరు వాహనాల నెంబర్ ప్లేట్లకు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటున్నారని.. ఆలా రాసి వన్‌వేలో తప్పుగా వెళ్లకూడదని చెప్పారు. ఎవరైనా రూల్స్ పాటించాలని పేర్కొన్నారు.