టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ తారక్ సరసన నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు. కాగా, బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ నిలిచింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు విడుదలైంది. డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
బియాండ్ ఫెస్ట్ అనేది అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవం. ఇందులో ‘దేవర’ సినిమాను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో బియాండ్ ఫెస్ట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్.. అభిమానులతో కలిసి సినిమా చూశారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చిన పలువురు అభిమానులను పలకరించారు. ఇందులో భాగంగా ఓ మహిళా అభిమానిని ఉద్దేశించి.. తప్పకుండా మీ దేశానికి వస్తానని మాట ఇచ్చారు తారక్.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన తారక్ కు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. జపాన్ లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన ఓ మహిళా అభిమాని ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా చూసేందుకు టోక్యో నుంచి లాస్ ఏంజెలిస్ కు వచ్చింది. ఎన్టీఆర్ ఆమెతో ముచ్చటించగా ఎంతో మురిసిపోయింది. తారక్‌ను చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్‌లో ఎదురుచూస్తున్నారని.. తమ దేశానికి రమ్మని తారక్ ను ఆహ్వానించింది.
ఆమె మాటలకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. తప్పకుండా వస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిపై ఆ అభిమాని స్పందించింది. తన అభిమానులతో కలిసి దేవరను చూసేందుకు జపాన్ వస్తానని తారక్ తెలిపాడు. అతను చాలా పెద్ద మనసున్న వ్యక్తి. తన అభిమానుల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారు’ అని ఆమె పేర్కొంది.