టాలీవుడ్‌కు సంబంధించిన గడిచిన మూడేళ్ల సంక్రాంతి పోటీలోకి వచ్చిన సినిమాలను గమనిస్తే ఓ ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. అది కూడా ముగ్గురు హీరోలకు సంబంధించి. వారెవరో కాదు.. రవితేజ, నాని, కళ్యాణ్ రామ్. ఈ ముగ్గురుకి మూడు సంక్రాంతులకు మధ్య రిలేషన్ ఏంటి.. ముగ్గురు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూసేద్దాం…
టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌లో స్టార్ హీరోలందరూ పోటీకి దిగుతుంటారు. దాదాపు అన్నీ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంటుంది. అలాంటి పండుగ సీజన్‌లో గత మూడింటిని గమనిస్తే రవితేజ, నాని, కళ్యాణ్ రామ్‌లకు మధ్య కామన్‌గా ఓ పాయింట్ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా పాయింట్ అనే విషయం లోతుల్లోకి వెళితే. ముందుగా 2023లో విడుదలైన సంక్రాంతి చిత్రాలను గమనిస్తే వాటిలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి చిత్రాలు హిట్ మూవీస్‌గా నిలిచాయి.
వాల్తేరు వీరయ్యను బాబీ డైరెక్ట్ చేశారు. వీరసింహా రెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. ఈ ఇద్దరి దర్శకుల తొలి హీరో రవితేజనే కావటం విశేషం. బాబీ తొలి డైరెక్షనల్ మూవీ పవర్ సినిమాలో హీరో రవితేజే. అలాగే గోపీచంద్ మలినేని తెరకెక్కించిన తొలి చిత్రం బలుపులోనూ హీరో రవితేజనే.
2024 సంక్రాంతి విషయానికి వస్తే ఇదే ఏడాది విడుదలైన చిత్రాల్లో హను మ్యాన్ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. అలాగే ఇదే ఏడాది వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ చిత్రం కూడా వచ్చింది. దీనికి శైలేష్ కొలను డైరెక్టర్. సైంధవ్ డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ ఇద్దరు దర్శకులను హీరో నానియే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రశాంత్ వర్మను ఆ! చిత్రంతో ఇంట్రడ్యూస్ చేయగా.. హిట్ సినిమాతో శైలేష్ కొలనుని దర్శకుడిగా మార్చారు.
2025 సంక్రాంతి బరిలోకి భారీ చిత్రాలే రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో ఇలాంటి కామన్ పాయింటే కనిపిస్తుంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా జనవరి 10న విశ్వంభర రానుంది. దీనికి వశిష్ట డైరెక్టర్. ఈయన తొలి సినిమా బింబిసార. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మించారు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. రానున్న సంక్రాంతి బరిలో ఉన్న మరో హీరో వెంకటేష్ సినిమాను పరిశీలిస్తే అనీల్ రావిపూడి దర్శకుడు. ఈయన తొలి చిత్రం పటాస్. దీన్ని కూడా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించటమే కాదు.. హీరోగానూ నటించి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.
ఇప్పుడు రానున్న సంక్రాంతికి ఇటు వశిష్ట, అటు అనీల్ రావిపూడిల్లో ఎవరూ హిట్ కొడతారనేది అందరిలోనూ ఆసక్తిని రేపే అంశమే. ఇలా నాని, రవితేజ, కళ్యాణ్ రామ్ మధ్య మూడు సంక్రాంతులకు కలిపి ఓ కామన్ పాయింట్ కుదిరింది.