టాలీవుడ్ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి. ముఖ్యంగా రాజమౌళి తీసిన ఈగ సినిమా ఒక రికార్డే అని చెప్పాలి. ఇండియాలో సినిమాలు పెద్దవిజయం సాధించాలంటే స్టార్ హీరోలు అవసరం లేదని నిరూపించారు. చిన్న ఈగతోనూ సినిమా తీసి బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టారు జక్కన్న. ఒక విజువల్ వండర్ అంటే ఈ సినిమా అనే విధంగా ఈగను తెరకెక్కించారు అయితే.. తాజాగా నాని ఈగ సినిమా సీక్వెల్ గురించి తనకి జక్కన్నకి మధ్య జరిగిన సరదా సన్నివేశాన్ని పంచుకున్నాడు.
ఈగ సీక్వెల్ గురించి ఒక సారి రాజమౌళితో తాను మాట్లాడినట్లు తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ ను తాను ఎప్పుడూ ఈగ సీక్వెల్ గురించి అడగలేదన్నారు. కానీ.. జక్కన్నతో మాత్రం ఒకసారి సరదాగా చర్చించినట్లు చెప్పారు. ఈగ సీక్వెల్ చేస్తామన్నారు కదా. ఎప్పుడు మొదలుపెడదామని అడిగినట్లు నాని చెప్పాడు. దానికి రాజమౌళి మాట్లాడుతూ ఈగ-2 సినిమా చేయడానికి నీతో అవసరం లేదు. ఈగ ఉంటే సరిపోతుంది. అదే సీక్వెల్‌లో తిరిగి వస్తుంది అన్నారని చెప్పారు. అయితే.. ఈగ సినిమా చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం అని రాజమౌళి ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నారుఆయనకు దీని సీక్వెల్ గురించి ఆలోచన వచ్చినప్పుడు కచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తారని హీరో నాని చెప్పారు. ఇదే జరిగితే మరోసారి ప్రపంచాన్ని మొత్తం ఆకర్షిస్తారు అని నాని జక్కన్నపై ప్రశంసలు కురిపించారు.
కాగా, 2012లో రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా వచ్చింది. నాని సమంత జంటగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుదీప్ కిచ్చ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు .ఈగ సినిమాకి రెండు జాతీయ అవార్డులు, 3 సైమా అవార్డులు, 5 సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. కాగా, నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. రాజమౌళి మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్టును పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించడానికి సిద్ధం అయ్యాడు.