ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకి వచ్చేయనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన దేవర సినిమాపై అటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఇటు సినీప్రియలోను భారీ ఆసక్తి నెలకొంది. మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని పొందాలని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆకాంక్షించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ‘నా ప్రియమైన తారక్ అన్నకు బెస్ట్ విషెస్. నా సోదరుడు అనిరుధ్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. రత్నవేలు చిత్రీకరించిన బెస్ట్ విజువల్కు అదిరిపోయే బీజీఎం లభించిందని అనుకుంటున్నా. తాను ఊహించుకున్న ప్రపంచాన్ని కొరటాల చాలా బాగా తెరకెక్కించారు. AMBలో FDFSలో కలుద్దాం’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తమన్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా సాబ్ చిత్రానికి, పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రానున్న ఓజీ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నారు.
దేవర సినిమాకి మ్యూజిక్ అందించిన అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర హాలీవుడ్ సినిమాను మరిపిస్తుందని అన్నాడు. హైదరాబాద్ లో అభిమానులతో కలిసి సినిమాను చూడాలని ఉందని తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయం కానున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.