తెలుగులో తొలి చిత్రం ‘సీతారామం’ బ్లాక్ బస్టర్ కావటమే కాదు, అందులో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా కూడా సూపర్ హిట్ కావటంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. తెలుగు నిర్మాతలు ఆమెను కథానాయికగా తమ చిత్రాల్లో నటింప చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటం మృణాల్‌కు ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. తెలుగులో నిర్మాతలు పెద్దగా పట్టించుకోవటం మానేశారు. మరో వైపు బాలీవుడ్లో అవకాశాలు వస్తుండటంతో అమ్మడు అటుగా దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు మృణాల్‌ను పరిచయం చేసిన దర్శకుడు హను రాఘవపూడి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. ఈ నెలలోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ పేరు వినిపించింది. ప్రభాస్‌తో ఈ అమ్మడు ఎలాంటి పాత్రలో మెప్పిస్తుందోనని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్‌కి ఈ సొగసరి నిరాశనే మిగిల్చింది. రీసెంట్గా ఓ అభిమాని ప్రభాస్ సినిమా గురించి అడిగినప్పుడు తాను ఆ సినిమాలో చేయటం లేదని క్లారిటీ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ బ్యూటీ డాల్ ఫోకస్ అంతా నార్త్ పైనే ఉందంటున్నాయి సినీ సర్కిల్స్.
టాలీవుడ్లో అవకాశాలు రావటం లేదో, లేక మన నిర్మాతలు ఆమెను పట్టించుకోవటం లేదో తెలియటం లేదు. కానీ.. మృణాల్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటోంది. అయితే గతంలో ఇలియానా, పూజా హెగ్డేలా నార్త్ సినిమాలు చేస్తూ సౌత్‌ను పక్కన పెట్టేస్తే, తర్వాత ఇక్కడ కూడా ఎవరూ ఆమెను పట్టించుకోరనేది మూవీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం.