మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా రానున్న చిత్రం మట్కా.ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ‘మట్కా’ విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి 1958 నుంచి 1982 వరకూ సాగే ఈ పీరియాడిక్ కథలో, వరుణ్‌తేజ్ నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాని, సుదీర్ఘమైన వారాంతాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల 14న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్రవర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ‘విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకురావాలి లేదా ఈ వాసు గుర్తుకురావాలి’ అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. నాలుగు విభిన్న పాత్రలను ట్రైలర్ లో చూపించి సినిమాపై ఆసక్తిని పెంచారు. ట్రైలర్ చూస్తుంటే ఫైట్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అర్ధం అవుతోంది
కాగా, ఈ చిత్రాన్ని విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. నవీన్‌చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. మట్కా ను తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.