మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఏడాది మార్చి లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను అందుకోలేకపోయింది. దీంతో మట్కా సినిమాను ఎంతో ప్రతిష్టాత్మికంగా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
చివరి దశ చిత్రీకరణలో ఉన్న ‘మట్కా’ విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరో వరుణ్‌తేజ్, ఇతర ఫైటర్లు పాల్గొని కొన్ని యాక్షన్ సీన్స్ పై షూటింగ్ జరుగుతుంది. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా ఫోకస్ చేశారు మేకర్స్ . 1958 నుంచి 1982 వరకూ సాగే ఈ పీరియాడిక్ కథలో, వరుణ్‌తేజ్ నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాని, సుదీర్ఘమైన వారాంతాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల 14న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్రవర్గాలు తెలిపాయి. నవంబర్ 14.. చిల్డ్రన్స్ డే సెలవు కావడం సినిమాకి కలిసి వస్తుందేమో చూడాలి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వరుణ్ తేజ్ పోస్టర్స్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచుతున్నాయి. నవీన్‌చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.