కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన చిత్రం ‘తంగలాన్’. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహన్ ఆరతి పాత్రలో నటించి అందరినీ అలరించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
తన జీవితంలో ‘తంగలాన్’ ప్రయాణాన్ని ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. ‘ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. విక్రమ్ గొప్ప నటుడు. ఈ సినిమా షూటింగ్ రోజులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇలాంటి విభిన్నమైన, బలమైన పాత్రలను రూపొందించడం సాహసమనే చెప్పాలి. ‘తంగలాన్’ ఆగస్టు 30న బాలీవుడ్‌లో విడుదల అవ్వనుంది . ఆరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ చిత్రాన్ని గొప్పగా చిత్రీకరించడానికి టీమ్ ఎంతో కష్టపడింది. ఆ కష్టాన్ని హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకముంది’ అని చెప్పారు. ఇక ఈ ముద్దుగుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రంలో నటించనుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రంలో నటీ నటులందరూ కూడా డీగ్లామరైజ్డ్ గా కనిపించిన సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రెండో పార్ట్ అయితే కచ్చితంగా ఉంటుంది. అనేక కథాంశాలతో ముడిపడి ఉన్నందున దీన్ని నాలుగు భాగాలుగా కూడా ప్రేక్షకులకు అందించొచ్చు. ఈ కథకు అంత బలం ఉంది’ అని తెలిపారు.