Monday, December 23, 2024

Latest Posts

‘కాంతార: చాప్టర్‌ 1’.. కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత



రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతార ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకోవడమే కాక కాసుల వర్షాన్ని కురిపించింది ఈ సినిమా. కన్నడ చిత్రమైనా అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కాంతార సినిమా. రూ.16 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’ రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది అంటే ఎంతటి విజయాన్ని సాధించిందో అర్ధమౌతుంది. ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.



మొదటి భాగాన్ని కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కించగా ఇప్పుడు దీని ప్రీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. దాదాపు రూ.125 కోట్లతో అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. మొదటి భాగం కన్నడలో  2022, సెప్టెంబర్‌ 30న విడుదల చేయగా 15 రోజుల వ్యవధిలో తెలుగులో విడుదల చేశారు మేకర్స్.  ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ప్రీక్వెల్ ను ఈసారి అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారట. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ‘కాంతార’ ప్రీక్వెల్‌లో చూపనున్నారు. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయి. ఇందులో భూతకోల నేపథ్యాన్ని మరింత చూపనున్నారు. ఇక ఈ సినిమా కోసం రిషబ్‌ శెట్టి గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. రిషబ్‌శెట్టి ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డును తెచ్చి పెట్టింది కాంతార సినిమా. ఈ సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ అవార్డును దక్కించుకున్నారు. ప్రస్తుతం దీని ప్రీక్వెల్ గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం..

‘కాంతార’కు ప్రీక్వెల్‌గా నిర్మితమవుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ  నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్ర నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఓ వేడుకలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ప్రీక్వెల్‌ చాలా బాగా వస్తోందని.. ఇప్పటికే 30శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రస్తుతం కుందాపురలో సిద్ధం చేసిన సెట్స్‌లో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలియజేశారు. ఇది కదంబ యుగం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది ఇందులో రిషబ్‌ మునుపెన్నడూ చూడని విధంగా విభిన్నమైన లుక్‌లో కనువిందు చేయనున్నారు. ఆయన తండ్రి పాత్రలో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.