ఎన్టీఆర్ అభిమానులు ఎన్నోఏళ్లుగా ఎదురుచూసిన చిత్రం ‘దేవర’. ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ సోలోగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది. ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్లపరంగా టాప్‌లో నిలిచింది. దేశవ్యాప్తంగా రూ.77కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు సాధించింది. ఇండియాలో వచ్చిన కలెక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.68 కోట్లుకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ హీరోయిన్ గా ఈ చిత్రంలో నటించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యింది జాన్వీ. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు. ‘దేవర’ను ఆదరించినందుకు ప్రేక్షకులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. ‘నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. నాలానే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. కొరటాల శివ కూడా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. వరుస ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఇది తన బెస్ట్ ఫిల్మ్ అని అందరూ మెచ్చుకుంటున్నట్లు చెప్పారు. కాగా, బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ నిలిచింది.