తలైవర్ రజినీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’. లియో చిత్రం తర్వాత లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టిస్తోన్న ఈ యంగ్ డైరెక్టర్ సూపర్ స్టార్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. కేవలం రజినీకాంత్ అనే కాకుండా ఇతర సినీ రంగాలకు చెందిన స్టార్స్‌ను కూడా రంగంలోకి దించుతుండటం కొస మెరుపు. ఇప్పటికే తెలుగు నుంచి నాగార్జున, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్, కోలీవుడ్ నుంచి శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన మరో అప్డేట్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి.
ఇంతకీ ‘కూలీ’లో రజినీకాంత్ చేయబోతున్న పాత్ర పేరేంటో తెలుసా!.. దేవా. విషయం అధికారికంగా బయటకు రావటంతో అందరూ లోకేష్‌ను ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే 33 ఏళ్ల క్రితం.. 1991లో రజినీకాంత్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘దళపతి’. ఈ మూవీలో మమ్ముట్టి పాత్ర పేరు దేవరాజ్. రజినీ పాత్ర పేరు సూర్య. దేవా స్నేహం కోసం కుటుంబాన్ని కూడా సూర్య పక్కన పెట్టేస్తాడు. అలాంటి దేవా పాత్ర పేరుని ఇప్పుడు కూలీ కోసం రజినీకాంత్ పాత్రకు పెట్టారంటే.. లోకేష్ తన యూనివర్స్‌లోకి దళపతిని లింక్ చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌పై మరింత క్లారిటీ రానుంది.
కూలీ చిత్రంలో రజినీకాంత్ ఓ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆ మధ్య విడుదలైన వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో సూపర్‌స్టార్ కుమార్తెగా శ్రుతీ హాసన్ కనిపించనుంది. నాగార్జున మాత్రం అందరికీ షాకిస్తూ సైమన్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో అలరించబోతున్నారు.