ముంబైలో జరిగిన ‘దేవర’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై అక్కడి జర్నలిస్ట్ ఒకరు చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ యంగ్ స్టార్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తోన్న చిత్రం దేవర. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. దేవర సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది జాన్వీ. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విల్లన్ గా నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. విడుదల సమయం దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మేకర్స్ ‘దేవర’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత కరణ్ జోహార్, అనిల్ తడాని సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంపై బాలీవుడ్ జర్నలిస్ట్ ఒకరు వివాదస్పద కామెంట్స్ చేశారు.
ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు ‘జై ఎన్టీఆర్’ అని నినాదాలు చేసేందుకు కొంతమందికి డబ్బు చెల్లించి తీసుకువచ్చారని ఆ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ‘దేవర’ సినిమా ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ముందు సీట్లను కేటాయించి, జర్నలిస్ట్‌లను వెనక్కు నెట్టారని ఇందులో వెల్లడించారు. బాలీవుడ్ జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఈ వీడియో పై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.