ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తన మ్యూజిక్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తాడు. ఇప్పుడు తన కుమార్తె ఖతిజా తండ్రి బాటలోనే నడుస్తూ సంగీత దర్శకురాలిగా పరిచయమయ్యారు. రెహ్మాన్ సంగీతంలో ‘యంతిరన్’ సినిమాలో ‘పుదియ మనిదా…’ అనే పాటను ఖతిజా ఆలపించిన సంగతి తెలిసిందే. హలిదా షమీమ్ దర్శకత్వంలో వస్తున్న ‘మిన్మిని’ అనే చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేశారు ఖతిజా. ఈ సినిమాలోని ఆడియోను చిత్రబృందం ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఖతిజా రెహ్మాన్ స్పందిస్తూ.. ఈ అనుభవం ఎంతో సంతోషంగా ఉంది. సరైన మార్గదర్శకత్వం చేసిన నా కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకే ఈ క్రెడిట్ దక్కుతుంది.ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలోనే తొలి చిత్రానికి సంగీతం అందించే అవకాశం రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని విధాలుగా అండగా నిలిచిన హలిదా, మనోజ్ పరమహంస, మురళిలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని ఆమె తెలిపారు.
‘మిన్మిని’ చిన్నారుల ఇతివృత్తంతో దర్శకురాలు హలీదా షమీమ్ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో గౌరవ్ కాలై, ప్రవీణ్ కిషోర్, ఎస్తర్ అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.